శ్రీనగర్ : కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రక్రియ సమీప భవిష్యత్తులో జరగవచ్చని పేర్కొన్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించే విషయంలో ఉన్న హామీ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు అవగాహన ఉందని ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూనే, ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా త్వరలో పునరుద్ధరించ బడవచ్చని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, నిధుల కేటాయింపు లేదా అభివృద్ధి ప్రాజెక్టుల అమలుపై రాజకీయ విభేదాల ప్రభావం ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం జమ్మూ కాశ్మీర్‌ను భారత రాజ్యాంగ పరిధిలోకి పూర్తిగా తీసుకు వచ్చిందని అన్నారు అథవాలే. తద్వారా వివిధ రాజ్యాంగ పరమైన నిబంధనలు , ప్రయోజనాలు ఆ ప్రాంతానికి వర్తించేలా చేసిందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితులు గణనీయంగా మెరుగు పడ్డాయని, అయితే ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావిస్తూ, ఆ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకోవాలని పాకిస్థాన్‌ను కోరిందని అథవాలే చెప్పారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం; భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కంటే పాకిస్థాన్ తన సొంత ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచు కోవడంపై దృష్టి పెట్టాలి అని ఆయన అన్నారు.
