అమరావతి : కృష్ణా డెల్టా పరిధిలో ఇప్పుడు నీళ్లకు కొదవ లేదని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఊహించని రీతిలో పెద్ద ఎత్తున నీళ్లు వస్తున్నాయని ఇక నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులంటూ ఉండవన్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులతో. వీరి వెంట రాష్ట్ర భారీ, సాగు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్టాడెల్టాకు ఇప్పటి వరకూ 500 టీఎంసీల నీటిని తీసుకు వచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు రైతులు, సాగు నీటి ప్రతినిధులు. చంద్రబాబును శాలువాతో సత్కరించారు.
కృష్ణాడెల్టాకు గోదావరి వరద నీరు, శ్రీశైలంలో పొదుపు చేసిన కృష్ణా నీటిని రాయలసీమకు ఇచ్చి ఏపీకి జలప్రదాత అయ్యారంటూ కొనియాడారు రైతన్నలు. అన్ని ప్రాంతాలకూ నీటి భరోసా కల్పించిన ముఖ్యమంత్రిని ఏపీ వాటర్ మాన్ అంటూ ప్రశంసలు కురిపించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీటితో కృష్ణాడెల్టాలో సిరులు పండించారని రైతులను కొనియాడారు. పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి వరద నీరు కృష్ణాబేసిన్‌కు తరలించి సద్వినియోగం చేసుకున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో సాధించిన జలవిజయం సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. పట్టిసీమ లిఫ్టు ద్వారా నీటిని తీసుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలకు రైతులూ సహకరించారని కితాబు ఇచ్చారు.
కాలువలను విస్తరించి రాష్ట్రానికి మరింత ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఈ ప్రాంత రైతుల కష్టాన్ని తీర్చి సంపద సృష్టించిందన్నారు. కృష్ణాబేసిన్‌లో గోదావరి జలాలను వినియోగిస్తూ పొదుపు చేసుకున్న కృష్ణా జలాలు రాయలసీమలో సాగు, తాగునీటికి మళ్లించామని వెల్లడించారు. రాయలసీమలో కియా లాంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలకు కూడా నీరివ్వగలిగామని తెలిపారు.
