ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారమే ప్ర‌ధాన ఎజెండా

స్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్

hellotelugu-PonnamPrabhakar

హ‌నుమ‌కొండ జిల్లా : ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు చేస్తున్న సూచనలు, విజ్ఞప్తులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు.

అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా కలిసి పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రాంత సమగ్ర అభివృద్ధికి అందరి సహకారంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు .ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న లబ్ధిదారులందరికీ మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ పక్షపాతం చూపడం లేదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం, మంత్రుల నియోజకవర్గాలతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా అర్హత ఆధారంగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. పేదోడు ఏ కులం, ఏ మతం, ఏ పార్టీకి చెందిన వాడన్నది కాకుండా, అర్హతే ప్రామాణికంగా ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని దశలవారీగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేస్తోందన్నారు. నిర్మాణం ఏ దశలో ఉందో పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి విడత నిధులను విడుదల చేస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు లబ్ధిదారుల కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Exit mobile version