తాకట్టులో ఉన్న ప్లాట్ల కేటాయింపుపై రెరా ఫైర్

పాత ప్రాజెక్టులపై తెలంగాణ రేరా కీలక తీర్పు

hellotelugu-TGRERA

హైదరాబాద్: రెరా చట్టం అమలులోకి వచ్చే సమయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) లేదా కంప్లిషన్ సర్టిఫికెట్ పొందని ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఖచ్చితంగా తమ పరిధిలోకి వస్తుందని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) స్పష్టం చేసింది. సంగీత సింగ్ అనే కొనుగోలుదారు దాఖలు చేసిన ఫిర్యాదుపై (నెం. 287/2024) విచారణ చేపట్టింది రెరా అథారిటీ. M/S ప్రావిడెంట్ హౌసింగ్ లిమిటెడ్ వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

విక్రయించే సమయంలో ఫ్లాట్లు తాకట్టులో ఉండ కూడదని, అటువంటి యూనిట్లను కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని అథారిటీ బిల్డర్ ను తప్పుబట్టింది. రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ లేకుండా ప్లాట్ ధరలో 10 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడం సెక్షన్ 13 ప్రకారం చట్ట విరుద్ధమని పేర్కొంది. ఈ కేసులో 10% కంటే ఎక్కువ వసూలు చేసినట్లు గుర్తించింది. రిజిస్టర్డ్ అగ్రిమెంట్లో స్వాధీన తేదీని (Possession Date) లేదా ప్రాజెక్టు కంప్లిషన్ తేదీని స్పష్టంగా పేర్కొంటేనే, జాప్యం జరిగినప్పుడు సెక్షన్ 18 కింద వడ్డీ పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. లిఖిత పూర్వక ఒప్పందం లేని పక్షంలో వడ్డీ చెల్లింపులు వర్తించవని వెల్లడించింది.

భవన అనుమతులు ఎప్పుడు పొందినప్పటికీ, OC పొందని పక్షంలో ఆ ప్రాజెక్టులు ‘కొనసాగుతున్న ప్రాజెక్టుల’ (Ongoing Projects) కిందకే వస్తాయని, తమకు వాటిపై పూర్తి అధికార పరిధి ఉంటుందని రెరా స్పష్టం చేసింది. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ కేసులో బిల్డర్పై పెనాల్టీ విధించనప్పటికీ, భవిష్యత్తులో నిబంధనలు ఉల్లంఘించవద్దని హెచ్చరించింది.

Exit mobile version