పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు

స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

hellotelugu-PawanKalyan

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా : పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు ఉప ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ శుక్ర‌వారం మంగ‌ళ‌గిరి క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు. గజరాజులకు మార్గమధ్యంలో పూలు చల్లి స్వాగతం పలికి వాటికి స్వయంగా ఆహారం అందజేశారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలు దేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు.

ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జయంత్, అభిమన్యుల సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మానవ-ఏనుగు ఘర్షణల నియంత్రణకు ఎంతో ఉపయోగ పడనున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలను కూటమి ప్రభుత్వం శాస్త్రీయ, మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు.

ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశిస్తూ పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో, మానవ-ఏనుగు ఘర్షణల నివారణకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ కుంకీ ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు. గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో ఎంతో చురుకుగా వ్యవహరించాయి.

Exit mobile version