సింగపూర్ : ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టిన, పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న కంపెనీలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెండు ప్రభుత్వాల నడుమ ఇప్పుడు పటిష్టమైన భాగస్వామ్యం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం లోకేష్ సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఎంవోయులోని అంశాల అమలుపై వర్కింగ్ గ్రూపుల ద్వారా ప్రతినెలా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆరుగురు మంత్రులు రెండు వారాల క్రితం సింగపూర్ – ఏపీ గవర్నెన్స్ ఎక్సలెన్స్ (SAGE) కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు శిక్షణా తరగతులకు హాజరై పరిపాలనలో తమ అనుభవాలను పంచుకున్నారని చెప్పారు. ఏపీకి చెందిన 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తాజాగా శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారి అనుభవాన్ని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను తమ విద్యా వ్యవస్థలో పొందుపరుస్తాం అన్నారు.
గత సమావేశంలో చర్చించిన అజెండా అంశాలపై వర్కింగ్ గ్రూప్ విస్తృతంగా పనిచేసిందని, ఇప్పుడు ఆ పటిష్టమైన పునాదిపై మరింత ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి లోకేష్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్‌షిప్, అమరావతి ఎకనామిక్ రీజియన్, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్/రియల్ టైమ్ గవర్నెన్స్ పై గత నవంబర్ లో సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఆ ఎంవోయు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (JISC) ఏర్పాటు చేశారు. జెఐఎస్ సీ ఆమోదించిన పనులను ముందుకు నడిపించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీ (JIWC)ని కూడా ఏర్పాటు చేశారు. వీటితోపాటు గతంలో పెండింగ్‌లో ఉన్న అంశాల పురోగతిపై తాజా సమాచారం, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై సింగపూర్ లో తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
