టమాటా ధరలపై తప్పుడు ప్రచారం త‌గ‌దు

రైతుల ప్రయోజనాలతో చెలగాటమా

hellotelugu-Atchannaidu

అమరావతి : టమాటా ధరలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా రైతులకు కిలోకు కేవలం రూ.2 మాత్రమే లభిస్తోందంటూ గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతా రాహిత్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి రైతులను అయోమయానికి గురిచేసేలా ప్రచారం చేయడం సరికాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టమాటా సగటు ధర కిలోకు రూ.10.55గా ఉందని, అన్నమయ్య జిల్లాలో రూ.10.58, మదనపల్లె మార్కెట్‌లో రూ.11గా ధర నమోదవుతోందని మంత్రి తెలిపారు. నిన్నటి మార్కెట్ ధరలను పరిశీలిస్తే వివిధ మార్కెట్లలో కనిష్టంగా రూ.6 నుంచి గరిష్టంగా రూ.16 వరకు ధరలు ఉన్నాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా టమాటా రైతులకు కిలోకు కేవలం రూ.2 మాత్రమే లభిస్తోందని చెప్పడం వాస్తవ విరుద్ధమని అన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్‌లో సరఫరా, డిమాండ్‌ను సమతుల్యం చేసేందుకు వ్యవసాయ మార్కెటింగ్, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది అధిక దిగుబడుల కారణంగా మార్కెట్లకు టమాటా రాక పెరిగినప్పటికీ, ముందస్తు ప్రణాళికలో భాగంగా సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించడం, దశల వారీగా నాట్లు వేయించడం వంటి చర్యల ద్వారా ఒకేసారి అధిక సరఫరా ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. జూలై నెలలో మార్కెట్లకు రోజువారీగా సగటున 5,000 నుంచి 5,500 మెట్రిక్ టన్నుల టమాటా రాకలు నమోదవుతున్నాయని, నిన్న వివిధ మార్కెట్లకు సుమారు 6,000 నుంచి 7,000 మెట్రిక్ టన్నుల వరకు రాకలు వచ్చాయని మంత్రి తెలిపారు. 12,225 మెట్రిక్ టన్నుల టమాటా రాకలు నమోదయ్యాయని, రాప్తాడు మార్కెట్‌లో భారీ స్థాయిలో లావాదేవీలు జరిగాయని ప్రచారం చేయడం కూడా వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రాప్తాడు మార్కెట్‌లో టమాటా రాకలే నమోదు కాలేదని తెలిపారు.

Exit mobile version