ధర్మశాల : ఐపీఎల్ 19వ సీజన్ లో రజిత్ పాటిదార్ నాయకత్వంలోని ఆర్సీబీ అద్బుతం చేసింది. కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్ లో బలమైన గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించింది. ఆపై ఆ జట్టును ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఓడించింది . భారీ స్కోరు నమోదు చేసి రికార్డు సృష్టించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 పరుగుల భారీ స్కోర్ లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో కెప్టెన్ రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొని 5 ఫోర్లు 9 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంతరం గుజరాత్ కేవలం 19.3 ఓవర్లలోనే 162 పరుగులకే చాప చుట్టేసింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి విల విల లాడారు. ఆ జట్టులో రాహుల్ తెవాటియా, జోస్ బట్లర్ మాత్రమే ఆడారు. ఒకరు 68 చేస్తే మరొకరు 29 పరుగులు చేశారు.
ఇక రజత్ పాటిదార్ గురించి చెప్పాల్సి వస్తే తను బ్యాటర్ గా గుర్తింపు పొందాడు.ఇండోర్‌లో జన్మించాడు. అతను చిన్నప్పటి నుంచే క్రికెట్ ఆడుతూ పెరిగాడు. అతని కుటుంబం అతను చదువుపై దృష్టి పెట్టాలని కోరుకుంది, కానీ రజత్ క్రికెట్‌నే ఎంచుకున్నాడు. 2015లో అతను మధ్యప్రదేశ్ తరపున రంజీ ఆడటం ప్రారంభించాడు. క్రమంగా, దేశవాళీ క్రికెట్‌లో అతను తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. 2018-19 రంజీ సీజన్‌లో 713 పరుగులు సాధించాడు. ఆ తర్వాత, 2022 రంజీ ఫైనల్‌లో, అతను ఒక శతకం సాధించి, 69 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.
రజత్ పాటిదార్ 2021లో ఆర్సీబీ జట్టులో చేరాడు, కానీ అతనికి పెద్దగా అవకాశాలు లభించలేదు. 2022 వేలంలో అతను అమ్ముడు పోక పోవడం విస్తు పోయేలా చేసింది. 2025లో ఆర్సీబీ జట్టు ఫాఫ్ డు ప్లెసిస్ స్థానంలో అతనికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. రజత్ ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేక పోవచ్చని చాలామంది భావించారు. కానీ తన ప్రశాంత చిత్తంతో, దూకుడు బ్యాటింగ్‌తో, అతను 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీకి మొట్టమొదటి సారిగా ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.2026లో కూడా తన జట్టును వరుసగా రెండవసారి ఫైనల్‌కు చేర్చాడు.
