ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన వ్యాఖ్యలు చేసింది. తప్పుదోవ పట్టించే రుణమాఫీ ప్రచారాలపై వార్నింగ్ ఇచ్చింది. కొన్ని మీడియా ఛానెళ్ల ద్వారా, ప్రత్యక్షంగా కొందరు వ్యక్తులు, సంస్థలు ఇటువంటి ప్రచారాలు నిరంతరం చేస్తుండటాన్ని తాము తీవ్ర ఆందోళనతో గమనిస్తున్నామని కేంద్ర బ్యాంకు తెలిపింది. రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేస్తూ చేసే అనధికారిక, తప్పుదోవ పట్టించే ప్రచారాల పట్ల ప్రజలను హెచ్చరించింది. అటువంటి వ్యక్తులు లేదా సంస్థలతో సంబంధాలు పెట్టుకోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని దెబ్బ తీస్తాయని, డిపాజిటర్ల ప్రయోజనాలను ప్రభావితం చేస్తాయని, అటువంటి వ్యక్తులు/సంస్థలతో సంబంధాలు పెట్టుకోవడం, సంబంధాలు కొనసాగించడం వల్ల ప్రత్యక్ష ఆర్థిక నష్టం వాటిల్ల వచ్చని కూడా అది నొక్కి చెప్పింది.
ఇటువంటి ప్రచారాలలో, ఇతర అంశాలతో పాటు, బ్యాంకులు / నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేస్తామని తప్పుడు వాగ్దానాలు చేయడం, రుణమాఫీ ధృవపత్రాలు లేదా అలాంటి పత్రాలను జారీ చేయడం, సమాచారం లేని ప్రజల నుండి సేవా లేదా న్యాయపరమైన ఛార్జీలతో సహా వివిధ సాకులతో రుసుములను వసూలు చేయడం వంటివి ఉంటాయని కేంద్ర బ్యాంకు తెలిపింది. అటువంటి సేవలను అందిస్తున్న వ్యక్తులు, సంస్థలు చేసే ఏవైనా వాదనలు అబద్ధం, తప్పుదోవ పట్టించేవి అని, వర్తించే చట్టాల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలకు దారితీస్తాయని పునరుద్ఘాటించబడింది.
