హైదరాబాద్ : పట్టుదల, నైపుణ్యాల పెంపు , విదేశీ భాషపై పట్టు సాధించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని తెలంగాణకు చెందిన యువ ఫిజియోథెరపిస్ట్ పి. ఐశ్వర్యరాణి నిరూపించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్ కామ్) సహకారంతో ఆమె జర్మనీలో ఫిజియోథెరపిస్ట్‌గా ఉద్యోగం సాధించారు. నెలకు రూ. 3.5 లక్షల ప్రారంభ వేతనంతో తను అక్కడ విధుల్లో చేరనున్నారు. విదేశాలలో ఉద్యోగ అవకాశాలను పొందే లక్ష్యంతో ఐశ్వర్యరాణి టామ్ కామ్ ను సంప్రదించారు. జర్మనీలోని వైద్య , ఆరోగ్య రంగాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా టామ్ కామ్ పర్యవేక్షణలో నిర్వహించిన జర్మన్ భాషా శిక్షణలో చేరారు. వివిధ స్థాయిలను విజయవంతంగా పూర్తి చేసింది. స్వరూపారాణి B2 స్థాయి వరకు జర్మన్ భాషలో శిక్షణ పొందారు. భాషా నైపుణ్యంతో పాటు, ఉద్యోగానికి అవసరమైన ప్రక్రియలను కూడా విజయవంతంగా పూర్తి చేసి, జర్మనీలో ఉద్యోగ అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా విద్యుత్ (కార్మిక, ఉపాధి, శిక్షణ , కర్మాగారాలు) , గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఐశ్వర్యరాణికి నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. విదేశాలలో ఆమె ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ యువతకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విదేశాలలో వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు మంచి డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా రాష్ట్ర యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
విద్యా అర్హతలతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలు , విదేశీ భాషలపై పట్టు ప్రపంచ వ్యాప్తంగా మంచి వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలకు దారితీస్తాయని మంత్రి పేర్కొన్నారు. జర్మనీతో పాటు ఇతర దేశాలలో కూడా వివిధ రంగాలలో తెలంగాణ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. విదేశాలలో కెరీర్‌ను నిర్మించుకోవాలని ఆశించే రాష్ట్ర యువతకు ఐశ్వర్యరాణి సాధించిన విజయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
