అమరావతి : కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ . వేలాది మంది ప్రయాణీకులు తన నిర్వాకం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం డాక్టర్ కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో రెండే రెండు ఎయిర్ లైన్స్ ఎందుకు ఉన్నాయో ఆలోచించాలని అన్నారు. అమెరికాలో 15కి పైగా ఎయిర్ లైన్స్ లు ఉన్నాయని చెప్పారు. ఇండియాలో ఎందుకు మూత పడుతున్నాయో ఆలోచించాలని , దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఎయిర్ ఇండియా విమానం కూలి పోయిన ఘటనలో వందల మంది చని పోయిన ఘటన జరిగినప్పుడే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సి ఉండేదన్నారు.
దేశ వ్యాప్తంగా కేంద్ర మంత్రి పూర్తిగా పాలనా పరంగా వైఫల్యం అయ్యాడని ఆరోపించారు. తను విమానాయన శాఖ మంత్రికి పనికి రాడని పేర్కొన్నారు. తనను చదివించానని చెప్పారు. ఈ సమయంలో టీడీపీ చీఫ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటూ ప్రశ్నించారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి సమ్మిట్ ను నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు . ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు కావాలని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను బఫూన్లను చేస్తున్నారంటూ ఆవేదన చెందారు. ప్రయాణీకుల ఇబ్బందులను తొలగించాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందన్నారు. కేవలం అదానీ కోసమే ఇదంతా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
