న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది రూ. 1400 కోట్లకు పైగా అయోధ్యలోని రామ మందిరం విరాళాల స్కాం కేసు. దీనిపై ఇప్పటికే విచారణ కు ఆదేశించింది యూపీ యోగి సర్కార్. ఇదే క్రమంలో మంగళవారం భక్తుల విరాళాల చోరీ ఆరోపణలపై ప్రతిపక్షం , అధికార పక్షం మధ్య ఘర్షణ కారణంగా పెద్దల సభ అయిన రాజ్యసభ వాయిదా పడింది. అయోధ్య రామమందిరం నుండి నగదు, విలువైన వస్తువుల చోరీ ఆరోపణలపై ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాడివేడి వాదనలు జరిగిన తర్వాత రాజ్యసభ కార్యకలాపాలు జరగవని తెలిసి చైర్మన్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు సమావేశమైన కొద్దిసేపటికే వాయిదా పడిన సభ, మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశం కాగానే చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ‘ప్రశ్నోత్తరాల సమయం’ చేపట్టారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు విరాళాల చోరీ ఆరోపణను లేవనెత్తి నినాదాలు చేయడం ప్రారంభించాయి.
కొందరు ప్రతిపక్ష సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరు కావాలని డిమాండ్ చేశారు. మీకు సభను నడపడంలో ఆసక్తి లేదు అని నిరసన తెలుపుతున్న సభ్యులతో రాధాకృష్ణన్ అన్నారు. మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్టు అంశాన్ని లేవనెత్తడానికి డిఎంకెకు చెందిన తిరుచి శివ ప్రయత్నించారు. కానీ ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశమని, సభలో దీనిని లేవనెత్తలేమని చైర్మన్ పేర్కొన్నారు. నిరంతర నినాదాలు, గందరగోళ నిరసనల మధ్య, రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అంతకు ముందు రామమందిరం నుండి నగదు , ఇతర విలువైన వస్తువుల చోరీ ఆరోపణలపై ప్రతిపక్షం , అధికార పక్షం మధ్య ఘర్షణలు, గందరగోళం కారణంగా రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. రామమందిరానికి భక్తులు సమర్పించిన నగదు, విలువైన వస్తువుల చోరీ ఆరోపణలను కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తగా, అధికార పక్షం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది.
