ఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను మహోన్నత మానవుడిగా అభివర్ణించారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. డిసెంబర్ 6న అంబేద్కర్ వర్దంతి. ఈ సందర్బంగా పార్లమెంట్ లో ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆలోచనలను, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ఉమ్మడి జాతీయ బాధ్యత అని గాంధీ పునరుద్ఘాటించారు. అంబేద్కర్‌ను ఒక మహోన్నత జాతీయ వ్యక్తిగా అభివర్ణించారు, ఆయన ఆలోచనలు భారతదేశ ప్రజాస్వామ్య, సామాజిక చట్రాన్ని రూపొందిస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ ఒక ఐకాన్. ఆయన మొత్తం దేశానికి ఒక మార్గాన్ని చూపించారని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
అంబేద్కర్ చేసిన కృషి వల్లనే ఇవాళ మనం స్వేచ్ఛగా అభిప్రాయాలను, ఆలోచనలను పంచు కోగలుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కానిస్టిట్యూషన్ ను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని ముక్కలు కానీయకుండా కాపాడే ప్రయత్నం చేశామన్నారు. కానీ కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ఈ రాజ్యాంగాన్ని మార్చేందుకు లోపాయికారీగా ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కానీ కోట్లాది మందికి ప్రాణ ప్రదంగా మారిన రాజ్యాంగాన్ని ముట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
