అమరావతి : రాజధాని అమరావతిని అత్యున్నత సాంకేతికత, ఆధునిక పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రీకృతమైన జాతీయ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డీమ్డ్ టూ బీ యూనివర్శిటీ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాజధాని ప్రాంతంలో కేటాయించిన 8.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.730.70 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం 100 శాతం గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఫండ్ లో సమకూర్చనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటమ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఇతర అధునాతన డీప్-టెక్ రంగాలలో విద్యా బోధన, ఉపాధి శిక్షణ, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ఒకే వేదిక మీదకు తీసుకు రానున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఏకైక విశ్వ విద్యాలయమైన నైలిట్ పంజాబ్‌లోని రోపర్‌లో ప్రధాన క్యాంపస్, దేశ వ్యాప్తంగా 56 కేంద్రాలు, 11 రాజ్యాంగ విభాగాలు, 700కు పైగా గుర్తింపు పొందిన సంస్థల నెట్‌వర్క్‌తో పనిచేస్తున్న నైలిట్ అమరావతి వేదికగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తన డీప్-టెక్ క్యాంపస్‌ను విస్తరిస్తోంది.
అమరావతిలో శాశ్వత ప్రాంగణ నిర్మాణం పూర్తయ్యేంతవరకు ఆగకుండా, వచ్చే నెల నుంచే విద్యార్థులు, వృత్తి నిపుణులకు కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వసతిలో విద్యా బోధన, అధునాతన సాంకేతిక శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయి. ఈ క్యాంపస్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ – సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, చిప్ డిజైన్, వీఎల్ఎస్ ఎల్ , ఎంబెడెడ్ సిస్టమ్స్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ హెచ్ పీ సీ వంటి కీలక రంగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ, డిప్లొమా, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేయనున్నారు. అమరావతి క్యాంపస్‌కు ప్రధాన ఆకర్షణగా 1.25 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో క్వాంటమ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ బ్లాక్’ ను నిర్మించనున్నారు. ఇందులో క్వాంటమ్ ఫోటోనిక్స్, క్రియోజెనిక్ సిస్టమ్స్, క్లీన్‌రూమ్ – నానో-ఫ్యాబ్రికేషన్, డేటా సెంటర్లు, స్టార్టప్ కో-వర్కింగ్ స్పేస్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అండ్ పేటెంట్ సెల్ కొలువుదీ రనున్నాయి. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, పారిశ్రామిక వేత్తలు కలిసి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలను వాణిజ్య స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ ల్యాబ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.
