ముంబై : ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జెన్ జీ యువతపై.
సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో యువతను క్రియాశీల భాగ స్వాములుగా చేయాలని రాజకీయ పార్టీలకు పిలుపు నిచ్చారు. ముంబైలో జరిగిన ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల కార్యక్రమంలో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రాజకీయాలు, పాలనలో జెన్ జీ యువతను భాగస్వామ్యం చేయడం ప్రాముఖ్యత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యువతరంతో తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను నేర్చుకున్న అతి పెద్ద పాఠం చాలా సులభమైనదని అన్నారు. వారిని తక్కువ చేసి మాట్లాడవద్దు. వారిని మొత్తం అభివృద్ధి ప్రయాణంలో భాగం చేయాలని పిలుపునిచ్చారు. జెన్ జీ, యువతతో తన అనుబంధం రాజకీయాలపై ప్రస్తుత ఉద్యమానికి చాలా ముందే ప్రారంభమైందని మంత్రి లోకేష్ అన్నారు. మా ముఖ్యమంత్రి , ఒక మంత్రిగా నేను వారిని పలుమార్లు కలిశామని చెప్పారు. మేము ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లందరినీ కలుస్తూ ఉంటాం. మేము ఇంకా బాగా ఎలా చేయగలమని మీరు అనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో మనం భిన్నంగా ఏమి చేయగలమని మీరు భావిస్తున్నారు? అని వారిని అడుగుతామని తెలిపారు.
ఇటువంటి సంభాషణల నుండి అద్భుతమైన ఆలోచనలు వస్తాయని అన్నారు నారా లోకేష్. ముఖ్యంగా వారి సూచనలను అనుసరించడానికి తమవద్ద ఒక వ్యవస్థ ఉందని లోకేష్ తెలిపారు. మీకు ఎంతో అద్భుతమైన ఆలోచనలు వస్తాయి, వాటిని మేము ఫాలో-అప్ చేసే విధానం ఉందన్నారు. కాబట్టి వారిని సంభాషణలో భాగం చేయండి, అదే వారు కోరుకుంటున్న మొదటి విషయం అని నేను నమ్ముతున్నాను అని అన్నారు. కొత్త తరం అంచనాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు మారాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాజకీయ నాయకులు తమ ఇగోలను వీడి ప్రామా ణికతను అలవర్చు కోవడం చాలా ముఖ్యమని లోకేష్ అన్నారు. రాజకీయ నాయకులుగా మనం మన బ్యారియర్స్ ను వదిలేయడం ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో యువత మీతో చాలా భావోద్వేగ స్థాయిలో కలవడానికి సిద్ధంగా ఉన్నారు, వారు మీ నుండి ప్రామాణికతను ఆశిస్తున్నారు అని పేర్కొన్నారు.
