ప‌చ్చ‌ద‌నం..ప‌ర్యావ‌ర‌ణ హితం కోసం ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక

ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఏపీ గ్రీన్ కార్య‌క్ర‌మాలు

hellotelugu-APGreen

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ కొణిద‌ల రాష్ట్రాన్ని పూర్తిగా ప‌చ్చ‌ద‌నంతో, ప‌ర్యావ‌ర‌ణ హితంగా మార్చాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇందులో భాగంగా ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక త‌యారీపై ఫోక‌స్ పెట్టారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి ఒడిలో రాష్ట్ర ప్రగతి ప్రయాణం సాగాలి. అది పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి. ఉన్న అడవులను కాపాడుకుంటూ, కొత్త అడవులను సృష్టించాలి. ప్రతి గ్రామాన్ని పచ్చదనపు ఛత్రం కిందకు చేర్చాలి. చెట్లను కాపాడుకుంటూ, ఆ చెట్ల నుంచి వచ్చే ఫలసాయం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించుకుంటూ, గ్రామాల్లో ప్రకృతి ఆధారిత జీవనోపాధి లక్ష్యాలు సాధించాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్ దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఆయ‌న ఆలోచ‌న నుంచి పుట్టిందే ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ రూపుదిద్దుకొంది. భవిష్యత్ తరాల కోసం పచ్చని, స్వచ్ఛమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు చేపడుతున్న 50 శాతం గ్రీన్ కవర్ కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకు రావడం కోసం ఏపీ గ్రీన్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా విధులు నిర్వహిస్తూ, అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, పరిశ్రమలు, జలవనరులు, పట్టణ స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సీఎస్‌ఆర్ సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ముందుకు తీసుకు వెళ్తుంది.

ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యం 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు, పచ్చదనపు విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంపొందించడం. ప్రస్తుతం రాష్ట్ర భూభాగంలో 37.42 లక్షల హెక్టార్లలో నోటిఫైడ్ అటవీ ప్రాంతం ఉంది. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 22.96 శాతం. 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో భాగంగా భావి తరాలను వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి కాపాడేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను నిరంతరాయంగా అమలు పరుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మ్ ఫారెస్ట్రీ, అగ్రో ఫారెస్ట్రీ, అవెన్యూ ప్లాంటేషన్లు, కాలువ గట్లు, షెల్టర్ బెల్ట్‌లు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో మొక్కల పెంపకాన్ని ఏపీ గ్రీన్ సంస్థ ద్వారా చేపడతారు. ముఖ్యంగా పచ్చదనం క్షీణించిన భూములు, మైనింగ్ ప్రభావిత ప్రాంతాలు, బంజరు భూములు, ఇతర ఎకో సెన్సిటివ్ జోన్ల పునరుద్ధరణకు ఈ కార్యచరణలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ మొత్తం కార్యక్రమాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోపాటు రైతులు, స్వయం సహాయక సంఘాలు, విద్యా సంస్థలను అనుసంధానిస్తూ, నాణ్యమైన మొక్కల ఉత్పత్తి, పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తారు.

గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలన్న భేదం లేకుండా 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, చెట్ల ఆధారిత జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సృష్టించడం, వాతావరణ మార్పులకు అనుగుణమైన జాతుల ఎంపిక, పెంపకం, తద్వారా శాస్త్రీయ పద్ధతులతో పర్యావరణ పునరుద్ధరణ చేపట్టడం అనే ప్రధాన లక్ష్యాలను ఏపీ గ్రీన్ అత్యంత నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్తుంది. జియో-ట్యాగింగ్, డిజిటల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొక్కల పెంపకం, వాటి మనుగడకు భద్రత కల్పించడం, గ్రీన్ కవర్ పెరుగుదల కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది.

ఏపీ గ్రీన్ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నాబార్డ్, సీఎస్ఆర్ నిధులు, కార్బన్ ఫైనాన్స్, కార్బన్ క్రెడిట్లు, గ్రీన్ బాండ్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, ఎకో-టూరిజం వంటి వివిధ వనరుల ద్వారా నిధులను సమీకరించనున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో- ఏపీ గ్రీన్ ఛైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఆధ్వర్యంలో నిధుల వినియోగం, పచ్చదనం పెంపొందించే అంశంలో అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి, మిషన్ మోడ్‌లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఏపీ గ్రీన్ సంస్థ గ్రీన్ కవర్ కార్యక్రమాల రాష్ట్ర స్థాయి సమన్వయం, పర్యవేక్షణ చేపడుతుంది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలు (DGDAs), మండల స్థాయిలో MGICs ద్వారా కార్యక్రమాలు అమలు చేస్తారు. ప్రతి అడుగులో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నారు.

Exit mobile version