అమరావతి : ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో చౌకధరల డిపో ద్వారా అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని ప్రజలు ఎందుకు పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు..? ప్రతి కేజీ మీద రూ.56 మేర రాయితీని వెచ్చిస్తుంటే ఆ బియ్యం ప్రజలకు ఎందుకు అక్కరకు రాకుండా పోతున్నాయి..? అనే విషయం మీద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ లోతుగా అధ్యయనం చేసిందన్నారు. నిపుణులు, ఆర్థికవేత్తలు, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత ప్రజా పంపిణీలో ఇప్పుడు అందిస్తున్న బియ్యం స్థానంలో, ప్రజలు ఆసక్తి చూపిస్తున్న స్టీమ్ రైస్ అందిస్తే వినియోగం పెరుగుతుందని గుర్తించామ’ని మనోహర్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతుందని, బియ్యం పక్కదారి పట్టడం తగ్గుతుందని చెప్పారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన ఢిల్లీలో ఆంధ్ర భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో స్టీమ్ రైస్ అందించే ప్రయోగాన్ని రాష్ట్రంలోని 42 వేల పాఠశాలలు, 4 వేల వసతి గృహాల్లో అమలు చేశాం అన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో రాష్ట్ర వ్యాప్తంగా స్టీమ్ రైస్ అందిస్తూ, నాణ్యమైన భోజనం పిల్లలకు అందిస్తున్నామని తెలిపారు . దీనికి రైతులు తగిన విధంగా సహకరించి 2.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎలాంటి అధిక బోనస్ లు ఆశించకుండా మాకు అందించారని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి తీసుకెల్లామన్నారు, ప్రజా పంపిణీలో కూడా స్టీమ్ రైస్ పంపిణీ చేయాలని తాము కోరినపుడు మంత్రి దగ్గర నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఓ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అమలు చేస్తామని చెప్పినపుడు కచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు.
