ప్ర‌భుత్వ బ‌డులలో కార్పొరేట్ వ‌స‌తుల క‌ల్ప‌న

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొంగూరు నారాయ‌ణ

hellotelugu-MinisterNarayana

అమ‌రావ‌తి : రాష్ట్ర పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని
అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి వసతులతో ఆధునీకరిస్తున్నాం అని వెల్ల‌డించారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి రూ. 9.69 కోట్లతో మల్లెల సంజీవయ్య పాఠశాలను ఆధునీకరించేందుకు ‘జిగ్మా’ సంస్థ ముందుకు వచ్చిందని చెప్పారు. నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి డాక్టర్ పి. నారాయణ ప్రసంగించారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరులోని ఏసీ నగర్‌లో ఉన్న మల్లెల సంజీవయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు ఆయన తన కుమార్తె పొంగూరు శరణితో కలిసి శంకుస్థాపన చేశారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ. 9.69 కోట్లతో ఈ పాఠశాలను ఆధునీకరించేందుకు జిగ్మా సంస్థ ముందుకు వచ్చిందని మంత్రి వెల్లడించారు.

కల్పిస్తున్న ఆధునిక వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మంత్రి నారాయ‌ణ‌. చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. తన తండ్రి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని పి. శరణి అన్నారు. తన చిన్నతనంలో తాను ఎదుర్కొన్న పేదరికం, కష్టాలను ఇతర విద్యార్థులు అనుభవించ కూడదనే సంకల్పంతోనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ అభ్యాస సౌకర్యాలను ప్రవేశ పెడుతున్నామని అన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు ఖగోళ శాస్త్ర ప్రయోగశాలలను కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అనంతరం మంత్రి నారాయణ నెల్లూరు నగరంలోని పలు పాఠశాలలను పరిశీలించారు.

Exit mobile version