హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ-సర్వేను 18 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం రియల్-టైమ్ పర్యవేక్షణ డాష్‌బోర్డ్ , పర్యవేక్షణ జోన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను భూ వివాద రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో ఈ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు. రీ-సర్వే పురోగతి , అమలు తీరును సమీక్షించేందుకు మంత్రి అధికారులతో సమావేశమయ్యారు. వేగం, నాణ్యత, పారదర్శకత , నిరంతర పర్యవేక్షణకు ప్రాధాన్యతనిస్తూ, దాదాపు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేపడుతున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించడానికి , భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి ఈ అవకాశాన్ని బాధ్యతాయుతంగా వినియోగించు కోవాలని కోరారు.
ఏడు జోన్లలో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రెవెన్యూ, సర్వే శాఖల నుండి 14 మంది అధికారులను ప్రభుత్వం నియమించింది. వీరు పురోగతిని పర్యవేక్షించడం, నాణ్యతా ప్రమాణాలను పాటించడం, ప్రజల స్పందనను అంచనా వేయడం , స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మొదటి దశలో 2,768 గ్రామాలు (గతంలో మ్యాప్‌లు లేని 365 గ్రామాలతో సహా) సర్వే పరిధిలోకి వస్తాయని తెలిపారు. ప్రతి జిల్లాలో 70 గ్రామాలు ఇందులో ఉంటాయని, 245 గ్రామాల్లో సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. నవంబర్ చివరి నాటికి మొదటి దశను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం రెండు రెవెన్యూ గ్రామాల్లో సర్వేలు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ప్రతి మండలానికి రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
వీటిలో లైసెన్స్డ్ సర్వేయర్, జీపీఓ, డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ , సహాయక సిబ్బంది ఉంటారని తెలిపారు మంత్రి. సర్వే జరుగుతున్న ప్రాంతాలను ప్రతిరోజూ తనిఖీ చేయాలని మంత్రి తహసీల్దార్లను ఆదేశించారు. సర్వే చేసిన ప్రాంతాలు, విస్తీర్ణం (ఎకరాలు), సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పురోగతి, ప్రజల స్పందన , పనిలో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించిన రికార్డులను అధికారులు నిర్వహించాలని ఆదేశించారు.
