ఉత్తర ప్రదేశ్ : రైతు ఉద్యమ నాయకుడు, బీకేయూ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్రంతో పాటు యూపీ సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపించారు. శుక్రవారం రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడారు. యూపీలో చట్టబద్ధమైన ఎంఎస్పీ హామీ, క్వింటాల్‌కు రూ.500 చెరకు ధరను కోరుతున్నా ఇప్పటి వరకు సర్కార్ పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక చెరకు ధరలతో సహా రైతుల డిమాండ్లను కేంద్ర, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని లేక పోతే వైఫల్యం చెందితే ఆందోళన చేపడతామని బీకేయూ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికైత్ హెచ్చరించారు. ఈ సందర్బంగా జీఐసీ గ్రౌండ్‌లో జరిగిన రైతు మహాపంచాయత్‌లో ప్రసంగించారు. రాబోయే క్రషింగ్ సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెరకు ధరను క్వింటాల్‌కు రూ.500 వరకు పెంచాలని తమ మండలి డిమాండ్ చేస్తోందని టికాయత్ ప్రయకటించారు.
భూమి సర్కిల్ రేటును పెంచాలని, వ్యవసాయ ప్రాంతాలకు రక్షణ కల్పించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టపరమైన హామీ ఇవ్వాలన్న తమ చిరకాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు నాయకుడు, దీంతో ఆందోళన చేపట్టడం తప్ప రైతులకు మరో మార్గం లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. నిన్న రాత్రి జిల్లా అధికారుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యూనియన్ 16 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించిందని చెప్పారు రాకేశ్ టికాయత్. రైతులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు.















