తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. గజ రాజులు ముందుగా నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి పల్లకీసేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
మోహినీ రూపంలో స్వామివారి దర్శనం జగత్తును ఆవరించిన మాయా మోహాన్ని అధిగమించి భగవంతుని శరణు పొందాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. సర్వమూ భగవంతుని లీలా విలాసమేనని, భక్తి మార్గమే మాయా మోహాల నుంచి విముక్తికి దారి చూపుతుందని ఈ అలంకారం చాటి చెబుతోంది. పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన గరుడ వాహన సేవకు 108 వైష్ణవ దివ్య దేశాల్లో విశిష్ట స్థానం ఉంది. భగవంతుని వాహనమైన గరుడుని దర్శించడం ద్వారా భక్తిలో శరణాగతి, జ్ఞానం, వైరాగ్యం కలగాలని స్వామి వారు అనుగ్రహిస్తున్నారనే విశ్వాసం ఉంది. గరుడుని దర్శనం సర్వ పాపాలను హరిస్తుందని, భక్తులకు ఆధ్యాత్మిక శుభఫలాలను ప్రసాదిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
ఈ వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

















