హైదరాబాద్ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కూకట్‌పల్లి , మూసాపేట గ్రామాల మధ్య ఉన్న ప్రాంతంలో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, పాఠశాల భవనాలు నిర్మించక పోవడంతో ఆ భూమి ఆక్రమణలకు గురవుతోందని , దీనిని రక్షించాలని కోరుతూ మూసాపేట నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి, మూసాపేట గ్రామాల మధ్య 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో తాగునీటి శుద్ధి ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4 ఎకరాలను వాటర్ బోర్డుకు కేటాయించిందని తెలిపారు. మిగిలిన 6 ఎకరాలలో, 2 ఎకరాలను మండల ప్రజా పరిషత్ బాలుర పాఠశాలకు , ఒక ఎకరాను జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు కేటాయించారు. దీనికి సంబంధించి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సరిహద్దులను నిర్ణయించి 2023లో కూకట్‌పల్లి మండల విద్యాశాఖ అధికారికి ఆ భూమిని అప్పగించారు.
అక్కడ భవనాల నిర్మాణం జరగక పోవడంతో, కేటాయించిన 2 ఎకరాలతో పాటు మిగిలిన 4.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా అక్కడ నిర్మాణాలు చేపడుతున్న పలు సంస్థలు ఆక్రమించు కున్నాయని, షెడ్లు వేసి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల రక్షణలో ముందున్న హైడ్రా మొత్తం 6.18 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే రక్షించి, కంచె (ఏర్పాటు చేయాలని కోరారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ గ్రామంలో, సర్వే నంబర్ 419లో ఒక రెడీ-మిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల పరిసరాలన్నీ కలుషితమవుతున్నాయి. అక్కడే పాఠశాలలు, నివాస గృహాలు ఉన్నాయి. దీనివల్ల తీవ్రమైన వాయు, శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని, ఈ విషయంపై మరో ఫిర్యాదు అందింది.
