హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణం ప్రస్తుతం పురోగతిలో ఉందన్నారు రాష్ట్ర గృహ , రెవిన్యూ , సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో కలిసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ టవర్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, లక్కీ డ్రా నిర్వహణ, కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ, సంబంధిత అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ‘ఇందిరమ్మ ఇళ్లు’ టవర్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. QR ప్రాంతంలో ప్రయోగాత్మక చర్యగా మొదటి దశలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 807.40 కోట్ల అంచనా వ్యయంతో ‘ఇందిరమ్మ ఇళ్లు’ టవర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. జూన్ 20 నుండి ఆగస్టు 15 వరకు మొత్తం 60,720 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన , దరఖాస్తుల తనిఖీ అనంతరం 40,900 మందిని అర్హులుగా 19,820 మందిని అనర్హులుగా గుర్తించామన్నారు. అనర్హతకు గల కారణాలను ప్రతి దరఖాస్తుదారు కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
ఈ నెల 27, 28, 29, 30 తేదీలలో సంబంధిత ప్రాంతాల్లోని ప్రత్యేక ఫంక్షన్ హాల్స్‌లో ప్రజలు , అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు. ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణా అధికారిని కూడా నియమించినట్లు చెప్పారు. లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారుల తుది జాబితా ప్రకటించిన తర్వాత, ఎంపిక కాని దరఖాస్తుదారులు చెల్లించిన రూ. 10,000 EMD (అర్నెస్ట్ మనీ డిపాజిట్) మొత్తాన్ని వెంటనే వారి ఖాతాలకు తిరిగి చెల్లిస్తామన్నారు. 27న రాయదుర్గం, కేపీహెచ్బీ కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి, రెడ్ హిల్స్ ప్రాంతాల్లో; 28న కౌకూరు, పాటిగడ్డ, జల్పల్లి, కుల్సుమ్‌పుర ప్రాంతాల్లో 29వ తేదీన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయన్‌పల్లి, బండ్లగూడ (LIG కాలనీ), నందిముసలిగూడ ప్రాంతాలలోనూ; అలాగే 30వ తేదీన గజులరామారం, అంబర్‌పేటలోని సిటీ పోలీస్ లైన్స్, గడ్డిఅన్నారం, R&B క్వార్టర్స్, పోచార (LIG కాలనీ) ప్రాంతాలలోనూ లక్కీ డ్రా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
‘ఇందిరమ్మ ఇళ్లు టవర్ల’ నిర్మాణానికి మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్తగా స్థలాలను ఎంపిక చేశామన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ (అమంగల్), గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి, ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాన్‌పూర్ (ఆర్టీసీ క్వార్టర్స్) , చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడ (ఫలక్‌నుమా సమీపంలో) ప్రాంతాలలో ఈ నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన వారు సెప్టెంబర్ 3వ తేదీ లోపు ‘ఇందిరమ్మ టవర్ల’ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
















