అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాలపై ఆరా తీశారు. ఇవాళ ఆయన సమీక్ష చేపట్టారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. తుపాను కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడిన ఇబ్బందులు, రహదారులపై పడిన చెట్ల తొలగింపు, డ్రైనేజీల శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, తాగు నీటి సరఫరా, వీధి దీపాల పునరుద్ధరణ తదితర అంశాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 75 మండలాల పరిధిలోని 852 గ్రామ పంచాయతీలు తుపాను ప్రభావానికి గురైనట్లు అధికారులు వివరించారు. ప్రభావిత జిల్లాల్లో 539 లోతట్టు, తీర ప్రాంత, ముంపు ప్రమాద ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యలను అంశాల వారీగా తెలుసుకుని దిశా నిర్దేశం చేశారు. అర్నబ్ తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలులకు గ్రామీణ రహదారులపై 776 చెట్లు నేలకొరగగా, యుద్ధ ప్రాతిపదికన తొలగింపు ప్రక్రియ చేపట్టి, ఇప్పటి వరకు 721 చెట్లను తొలగించినట్లు వెల్లడించారు.
కాకినాడ జిల్లాలో రోడ్లపై కూలిన 33 చెట్లను తొలగించామని, తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమలో కొంతమేరకు సహాయక చర్యలు ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన 55 చెట్లను కూడా ఇవాళ రాత్రి లోపు తొలగించి గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. తుపాను కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడిన 577 డ్రెయిన్లను గుర్తించగా, 528 డ్రెయిన్లలో అడ్డంకులను తొలగించినట్లు తెలిపారు. డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడితే, భారీ వర్షాలతో ఏర్పడిన నీటి నిల్వల తొలగింపు కష్టసాధ్యం అవుతుందని, మిగిలిన 49 డ్రెయిన్లను కూడా తక్షణం శుభ్రం చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. డ్రెయిన్లలో మురుగు నీరు నిల్వ ఉంటే ప్రజలు ఇబ్బందులు పడతారని, భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల నుంచి నీరు తక్షణం బయటకు వెళ్లేలా డ్రెయినేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని ఆదేశించారు.
గ్రామ పంచాయతీల పరిధిలో 566 వీధి దీపాలు దెబ్బతినగా ఇప్పటి వరకు 147 పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. అందులో కృష్ణా జిల్లాలో 136, శ్రీకాకుళంలో 210, అనకాపల్లిలో 85, విశాఖపట్నంలో 63, విజయనగరంలో 58, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14 వీధి దీపాలు దెబ్బతిన్నట్లు వివరించారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణతోపాటు వీధి దీపాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం చెప్పారు. నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పాములు, తేళ్ల వంటి విషపు పురుగుల సంచారం ఉండే అవకాశాలు ఉంటాయని, వీధి దీపాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చీకటిపడే లోపు ఈ పనిని పూర్తి చేయాలని ఆదేశించారు.
















