అమరావతి : అర్నబ్ తుపాను నేపథ్యంలో ప్రజల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర హోం మంత్రి శాఖ మంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లోని పలు గ్రామాలను సందర్శిస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను సమీక్షించారు.
ఈ పర్యటనలో భాగంగా ఎస్.రాయవరం మండలం చిన్నగుమ్ములూరు గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని సందర్శించారు మంత్రి అనిత. అక్కడ ప్రజలకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఆహారం, ఇతర సదుపాయాలు ఎలా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అధికారులు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారా అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని, పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని గ్రామస్తులు మంత్రికి తెలిపారు.
అనంతరం ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ గ్రామ గ్రామాన పర్యటించారు మంత్రి, ఇదేశమ్మ వాక వద్ద నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ వాల్‌ను పరిశీలించారు. వరాహ నదిలో నీటి ప్రవాహ పరిస్థితులను కూడా స్వయంగా పరిశీలించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రజల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
















