హైదరాబాద్ : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఐదు రోజుల పర్యటనను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై డా. బి. ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రపతి పర్యటన సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసు శాఖ భద్రతా, ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను సిద్ధం చేయాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు ఫైర్ టెండర్లు, అన్ని రకాల అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ వైద్య బృందం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లు భవనాల శాఖ అవసరమైన బారికేడ్లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, జీహెచ్ఎంసీ–పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
















