విద్యుత్ ప్ర‌భావం నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

నీటిని పొదుపుగా వాడు కోవాల‌న్న జ‌ల‌మండ‌లి ఎండీ

hellotelugu-HyderabadWater

హైద‌రాబాద్ : జ‌ల‌మండ‌లి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. హైద‌రాబాద్ న‌గ‌ర వాసులు నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని సూచించింది. ఎడ తెరిపి లేకుండా వ‌డ‌గాలులు, ఈదురు గాలుల‌తో పాటు ఆక‌స్మికంగా వ‌ర్షం రావ‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచి పోయింది. దీంతో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డుతోంద‌ని తెలిపింది. ఈ మేర‌కు సంస్థ త‌ర‌పున ఎండీ అశోక్ రెడ్డి కీల‌క సూచ‌న‌లు చేశారు. మంజీరా Phase-I & II కు చెందిన కలబ్లూర్, రాజంపేట, పటాన్ చెరు పంపింగ్ స్టేషన్లలోని అన్ని పంపులు రాత్రి 12 గంటలకు అకస్మాత్తుగా ట్రిప్ అయ్యాయని తెలిపారు. TGSPDCL నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడటంతో పంపింగ్ పూర్తిగా నిలిచి పోయింద‌న్నారు.

భారీ ఈదురు గాలులు, చెట్లు విద్యుత్ లైన్ లు పడటం వల్ల పలుచోట్ల లైన్లు ట్రిప్ అవుతున్నాయని తెలిపారు ఎండీ . విద్యుత్ శాఖ సిబ్బంది ఫాల్ట్ లొకేషన్లు గుర్తించి వెంటనే మరమ్మత్తు పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన వెంటనే పంపులను తిరిగి ప్రారంభించనున్న‌ట్లు చెప్పారు. తాత్కాలికంగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. తాజాగా ఎండీ అశోక్ రెడ్డి పునరుద్ధరణ పనులపై తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయంతో మరమ్మత్తు పనులు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు.

సాధ్యమైనంత త్వరగా విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. ప్రజలు తాగునీటిని మితంగా వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేసారు. ఇదిలా ఉండ‌గా నీటి ఎద్ద‌డి ఏర్ప‌డే ప్రాంతాల‌ను వెల్ల‌డించారు. ఓ అండ్ ఎం డివిజ‌న్ 17 లోని ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్. ఓ అండ్ ఎం డివిజ‌న్ 22 లోని బీరంగూడ‌, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ, ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్ 2లో ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు, ఓ అండ్ ఎం డివిజ‌న్ 6 లో ని ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్ , ఓ అండ్ ఎం డివిజ‌న్ 9 లోని కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ లో నీటి స‌ర‌ఫ‌రా ఉండ‌ద‌న్నారు ఎండీ.

Exit mobile version