హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజకీయ ప్రచారం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ మర్యాదలపై దాడితో సమానమని బీజేపీ జాతీయ సహ-ఇన్‌ఛార్జ్ (తమిళనాడు, కర్ణాటక) , మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకత్వం తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థలను గౌరవిస్తూ, “దేశం మొదట – ప్రజలే మొదట” అనే సూత్రాలకు కట్టుబడి ఉందని డాక్టర్ రెడ్డి అన్నారు. వరుస ఎన్నికల ఓటములను అంగీకరించలేక, విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ విధ్వంసకర , బాధ్యతా రాహిత్యమైన రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ చర్యలకు నిరసనగా డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, రాష్ట్ర కార్యదర్శి కసం వెంకటేశ్వర్లు, రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, శివరాజ్, మహేష్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు . శాంతియుత నిరసన తెలిపే తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించు కునేందుకు అనుమతించక పోగా, నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను తెలంగాణ ప్రభుత్వం గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించిందని ఆ పార్టీ నేత ఆరోపించారు.
అరెస్టులు, బెదిరింపుల ద్వారా ప్రతిపక్షాన్ని అణచివేసే ప్రయత్నాలు బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేవని డాక్టర్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంతో పాటు, కాంగ్రెస్ పార్టీ యొక్క “ప్రజాస్వామ్య వ్యతిరేక” చర్యలను ప్రజల ముందు ఎండగట్టడాన్ని పార్టీ కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. ఎంతటి రాజకీయ అణచివేత చర్యలైనా బీజేపీ గొంతును నొక్కలేవు. దేశం, ప్రజల ప్రయోజనాల కోసం మేము నిర్భయంగా మా గళాన్ని వినిపిస్తూనే ఉంటామన్నారు. బెదిరింపుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీన పరచలేరు అని డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.
