అమరావతి : ఎల్ నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికా విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ తరహాలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ టెక్నాలజీని సమర్ధంగా అనుసంధానించి లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉందని కృష్ణా నదిలో ప్రవాహాలు లేని కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు ఇంకా పూర్తిగా నిండలేదని అన్నారు. గోదావరికి వచ్చిన వరద ప్రవాహాలను మళ్లించి కృష్ణా డెల్టాకు నీరిచ్చామని సీఎం పేర్కొన్నారు. భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నాయని.. ఈ నేపథ్యంలో స్థూల ఉత్పత్తి పడిపోకుండా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి లోటుపాట్లను సరి చేసుకోవాలన్నారు. ప్రతీ ప్రభుత్వశాఖ అత్యున్నత స్థాయి లక్ష్యాలను చేరుకునేలా వనరుల నిర్వహణ చేపట్టాలన్నారు నారా చంద్రబాబు నాయుడు. నిర్దుష్టమైన ప్రమాణాలను అనుసరించి ఫలితాలు వచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. రూపోందించే ప్రతీ ప్రణాళికా రాష్ట్ర వృద్ధిరేటును పెంచేలా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలపై ఎలాంటి ధరల భారం పడకుండా చూడాలని దీనిపై ఓ కమిటీ వేయాలని సూచించారు. నీటి లభ్యత, ఉత్పత్తులకు విలువ జోడింపు లాంటి అంశాలపై సూచనాత్మక కంటిజెన్సీ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఏపీ 15 శాతం వృద్ధిరేటు సాధించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి కావాల్సిన ఉత్పత్తులపై ప్రభావం లేకుండా చూడాలన్నారు. జిల్లా, నియోజకవర్గం మండల వారీగా నివేదికలు ఇస్తే లక్ష్యాల సాధన సులువు అవుతుందని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షకు ఆర్ధిక, ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ప్రణాళికా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఆర్ అలపర్తి, సీఎంఓ అధికారులు రాజమౌళి, ప్రద్యుమ్న తదితరులు హాజరయ్యారు.
