ఆటోపైలట్ మోడ్‌లో పరిశ్రమలకు ప‌ర్మిష‌న్ : సీఎం

వైద్య రంగంలో అద్భుత అవకాశాలు అందిపుచ్చుకోవాలి

hellotelugu-ChandraBabu

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆటోపైలట్ మోడ్‌లో పరిశ్రమలకు ప‌ర్మిష‌న్స్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అనుమతులన్నీ ఆటోపైలట్ మోడ్‌లో ఇచ్చే బాధ్యత తమదని, నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించే బాధ్యత పారిశ్రామిక వేత్తలదని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్య, వైద్యంలో ఆంధ్రప్రదేశ్ తిరుగులేని స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోని ప్రతీ ముగ్గురు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిలో ఒకరు అమరావతి నుంచే తయారు కావాలన్నారు. అమరావతిలోని నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించారు.

సంస్థలకు శంకుస్థాపనలతో పాటు వేగంగానూ ప్రారంభోత్సవాలు కావాలన్నారు సీఎం. 2027లో ఇదే రోజున అమరావతిలో కిమ్స్ ఆస్పత్రి ప్రారంభం కావాలి. ప్రజలకు సేవ చేసేందుకు భాస్కరరావు కిమ్స్ ఏర్పాటు చేశారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆస్పత్రి ఇప్పుడు విస్తరించి 30 వేల కోట్ల ఆస్తిగా మారింది. ఎంట్రప్రెన్యూర్‌గా మారితేనే దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టికి అవకాశం ఉంటుందన్నారు. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు. గతంలో హైదరాబాద్‌లో చాలా తక్కువ ఆస్పత్రులు హోటళ్లు మాత్రమే ఉండేవన్నారు. సీఐఐ సదస్సులు పెట్టేందుకు కనీసం కన్వెన్షన్ సెంటర్లు కూడా ఉండేవి కావన్నారు. నాడు తీసుకున్న అభివృద్ధి చర్యలతో ఇప్పుడు దేశానికే మెడికల్ హబ్‌గా హైదరాబాద్ తయారైందన్నారు.

Exit mobile version