అమరావతి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. 50 ఏళ్లు నిండిన 85,678 మంది చేనేతలకు రూ.4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. 51,952 మంది నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మర్గం నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. మగ్గం నేతన్నలకు నెలకు రూ. 720లు, ఏడాదికి రూ.8,640లు, మర మగ్గం నేతన్నలకు నెలకు రూ.1800 చొప్పున ఏడాదికి రూ. 21,600లు లబ్ధి కలుగుతోందని చెప్పారు ఎస్.సవిత. మగ్గం నేతన్నలకు నేతన్న సేవ రూ.25 వేలు, పెన్షన్ రూ.48 వేల చొప్పున రూ.48 వేలు, ఉచిత్ విద్యుత్ తో రూ.8,640లు మొత్తం ఏడాదికి రూ. 81,640లు ప్రత్యక్ష ఆర్థిక లబ్ధి కలుగుతుందన్నారు. మర మగ్గం నేతన్నలకు నేతన్న సేవ పథకం కింద రూ.25 వేలు, పెన్షన్ రూపంలో రూ.48 వేలు, ఉచిత విద్యుత్ కింద రూ.21,600లు కలిపి మొత్తం రూ.94,000 లబ్ది చేకూర్చడం జరిగిందన్నారు ఎస్. సవిత
కూటమి ప్రభుత్వం రాగానే నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చామని మంత్రి సవిత గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెక్స్ టైల్స్ పార్కులు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేతన్నలకు గౌరవప్రద జీవనమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఏటా త్రిఫ్డ్ ఫండ్ కింద రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు, నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ అందజేస్తున్నామని తెలిపారు. చేనేతలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేవారు. ఆప్కో చరిత్రలో మొట్ట మొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టిటీడీ) ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. చంద్రబాబు పాలన నేతన్నలకు ఎప్పుడూ స్వర్ణయుగమేనని మంత్రి సవిత కొనియాడారు.
