అమరావతి : పరకామణి చోరీ అంశాన్ని అంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్న మాజీ సీఎం జగన్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇస్లాం, క్రైస్తవంలో కూడా చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతారా అని ప్రశ్నించారు. మరి హిందువుల విషయానికి వస్తే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన తను ఇలా మాట్లాడటం భావ్యం కాదన్నారు. ఇతరుల మనో భావాలను గౌరవించక పోతే ఎలా అని ప్రశ్నించారు. అందుకే ఏపీ ప్రజలు తనను, తన పార్టీని బండకేసి కొట్టారని , కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. అయినా సోయి లేకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తారని, వారికి పెద్ద ఎత్తున వసతి సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ అని తెలిపారు. కోట్లాది భక్తుల మనోభావాలతో కూడుకున్న అంశం పరకామణి అని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. భక్తులు తమ కోరిన కోర్కెలు తీరడంతో భక్తితో కాసులను, కానుకలను సమర్పించు కుంటారని, చివరకు స్వామి వారికే శఠగోపం పెట్టేందుకు జగన్ రెడ్డి, ఆయన అనుచర గణం ప్రయత్నం చేశారని ఆరోపించారు పవన్ కల్యాణ్. ఇకనైనా పద్దతిగా మాట్లాడటం జగన్ రెడ్డి నేర్చుకోవాలని హితవు పలికారు .
