తిరువనంతపురం : సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో పేరు పొందిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన చేశారు. దీపారాధనతో పాటు ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శంఖు చక్రాలతో పాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీ రామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించి, సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు. శ్రీరామ స్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణునికి, అయ్యప్ప స్వామకి పట్టు వస్త్రాల సమర్పించారు.
అనంతరం గర్భాలయంలో మూల విరాట్టుకి కుడివైపు ఉన్న దక్షిణా మూర్తికి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడికి, అనంత పద్మనాభ స్వామి వారి శయన రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేల్ శాంతి(ప్రధాన అర్చకులు) శ్రీ రామన్ తిరుమేని పూజ అనంతరం పవన్ కళ్యాణ్ కి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. అంతకు ముందు శ్రీరామ స్వామి క్షేత్రానికి విచ్చసిన పవన్ కళ్యాణ్ కు కొచ్చిన దేవస్థానం బోర్డు ఛైర్మన్, శ్రీరామ స్వామి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీరామ స్వామి వారి దర్శనానికి ముందు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అదే ప్రాంగణంలో ఉత్తర దిక్కున ఉన్న శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. అనంతరం మీనుట్టు (చేపలకు ఆహారం అందించడం) సేవలో పాల్గొన్నారు. తీర్వా నదికి ఆలయం అనుకుని ఉండడంతో, ఆ నదిలో చేపలకి ఆహారం అందించడం ఆచారంగా వస్తోంది.
