తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించు కోవాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆకాంక్షిస్తుంటారని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు. స్వామి వారి దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమలకు చేరుకునే భక్తులకు, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా దర్శనం, వసతి కోసం సిఫార్సు లేఖలను స్వీకరించడంపై విధించిన ఆంక్షలు ఇబ్బందికరంగా మారాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు తదితరుల సిఫార్సు లేఖల ద్వారా దర్శనం పొందాలని ఆశించే భక్తులు నిరాశకు గురవుతున్నారని వాపోయారు. ఎన్నికల నియమావళిని గౌరవిస్తూనే సామాన్య భక్తుల ఇబ్బందులను తగ్గించే ప్రత్యామ్నాయ మార్గాలను టీటీడీ పరిశీలించాలని కోరారు.
సిఫార్సు లేఖల ఆధారంగా ఉచిత దర్శనం లేదా ఇతర ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాని పరిస్థితుల్లో, కనీసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ద్వారా స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ముందస్తు ప్రణాళికతో దర్శనం చేసుకునే అవకాశం కల్పించేందుకు రాష్ట్రాల వారీగా టికెట్ల కోటా విడుదల చేయడం లేదా పారదర్శకమైన ఆన్లైన్ విధానంలో టికెట్లు అందుబాటులో ఉంచడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని సూచించారు. ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా ప్రముఖులకు కల్పించే సౌకర్యాలకు భిన్నంగా, సామాన్య భక్తులు అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే భావన కలగకుండా, ప్రతి భక్తుడి విశ్వాసానికి గౌరవం ఇచ్చేలా దర్శన వ్యవస్థ ఉండాలని అన్నారు.
ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిశీలించి, టీటీడీ సంబంధిత అధికారులతో చర్చించి భక్తులకు ఊరట కల్పించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి, టీటీడీ నిబంధనలకు అనుగుణంగా సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ద్వారా అవకాశం కల్పించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతో పాటు, టికెట్ల కేటాయింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. తిరుమల శ్రీవారి దర్శనం ప్రతి భక్తుడి ఆధ్యాత్మిక ఆకాంక్ష అని, వీఐపీలైనా సామాన్యులైనా ప్రతి భక్తుడి విశ్వాసానికి సముచిత గౌరవం లభించాలని, నిబంధనలకు లోబడి దర్శనాన్ని మరింత సులభతరం చేయడం ద్వారా భక్తులకు ఉపశమనం కల్పించాలని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు.
