30 నుంచి ఢిల్లీ ఎస్వీ ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

hellotelugu-TTD

న్యూఢిల్లీ : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 01వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు . ఈ సందర్భంగా అక్టోబర్ 30న పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం; 31న పవిత్ర సమర్పణ; నవంబర్ 01న మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించనున్న‌ట్లు వెల్ల‌డించింది. చివరి రోజు సాయంత్రం నాలుగు మాడ వీధులలో స్వామివారి తిరుచ్చి వీధి ఉత్సవం నిర్వహిస్తారని తెలిపింది.

ఆలయంలో నిత్యం నిర్వహించే అర్చనలు, ఆర్జిత సేవలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు తదితర వైదిక క్రతువుల్లో తెలిసీ తెలియక సంభవించే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో అంకురార్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ, విశేష హోమాలు, పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. తద్వారా స్వామివారి కృపాకటాక్షాలు భక్తులపై ప్రసరించి, సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తారు. ఇదిలా ఉండ‌గా సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించు కునేందుకు వ‌స్తారు భ‌క్త బాంధ‌వులు. దీంతో టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపింది టీటీడీ. మ‌రో వైపు అక్టోబ‌ర్ 26న తిరుమ‌ల‌లో గుర‌డ సేవ జ‌రుగుతుంద‌ని, ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్త‌యిన‌ట్లు పేర్కొంది .

Exit mobile version