ఉద్రిక్తతలను తగ్గించడంలో పార్ల‌మెంట్లు కీల‌క పాత్ర

పార్ల‌మెంట‌రీ ఫోర‌మ్ లో స్పీక‌ర్ ఓం బిర్లా కామెంట్స్

hellotelugu-OmBirlaa

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ స్పీక‌ర్ ఓం బిర్లా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచ ఉద్రిక్తతలను తగ్గించడంలో, అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో పార్లమెంట్లు కీలక పాత్ర పోషించగలవు అని పేర్కొన్నారు. ఢిల్లీ లోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌లో ప్రసంగించారు. శాంతియుత మార్గాల ద్వారా అంతర్జాతీయ ఉద్రిక్తతలను తగ్గించడంలో , ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడంలో పార్లమెంట్లు దోహద పడగలవని లోక్‌సభ స్పీకర్ పేర్కొన్నారు. దేశాల మధ్య పరస్పర అవగాహనను, నమ్మకాన్ని పెంపొందించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషించగలవని ఆయన చెప్పారు. ఈ సమావేశం పార్లమెంటరీ సహకారాన్ని బలోపేతం చేయడం , ప్రజల కేంద్రంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుందని సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఓం బిర్లా తెలిపారు. నేడు ప్రపంచం ప్రాంతీయ సంఘర్షణలు, యుద్ధాలు, ఆర్థిక అస్థిరత, వాణిజ్య ఉద్రిక్తతలు, ఉగ్రవాదం, వాతావరణ మార్పుల వంటి తీవ్రమైన సమస్యలతో సతమతమవుతోందని అన్నారు.

వీటి ప్రభావం ఒక దేశ సరిహద్దులకే పరిమితం కాదన్నారు. ఇటువంటి క్లిష్ట సమయాల్లో సహకారం, చర్చలు , దౌత్యం ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది అని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో పార్లమెంటరీ దౌత్యం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ దేశాల మధ్య నమ్మకాన్ని నిర్మించడంలో , శాంతియుత పరిష్కారాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో శాసనసభలు గణనీయమైన కృషి చేయగలవని లోక్‌సభ స్పీకర్ అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రస్తావిస్తూ దేశాన్ని ‘ప్రజాస్వామ్యానికి మాతృక’ అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రజాస్వామ్య శక్తి ఆధారంగానే భారతదేశం తన 75 ఏళ్ల ప్రయాణంలో వేగంగా పురోగమించింది అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, “గ్లోబల్ సౌత్ దేశాలకు ఒక బలమైన గొంతుకగా మారే సామర్థ్యం బ్రిక్స్‌కు ఉంది అని ఓం బిర్లా పేర్కొన్నారు. మన ఆశయాలు కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా , సాధించ దగినవిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

Exit mobile version