బెంగళూరు : కర్ణాటక బీజేపీ అగ్ర నేత, ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న తను ప్రధానమంత్రి మోదీని వ్యక్తిగతంగా దూషించడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తున్న రాజకీయ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి కుటుంబం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ వాదనలతో ప్రత్యర్థులను ఎదుర్కోలేక, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి అనాగరిక రాజకీయాలను ప్రజలు అంగీకరించరని అశోక స్పష్టం చేశారు. కర్ణాటకలో చెరకు రైతులు చేస్తున్న ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అశోక విమర్శించారు.
బెళగావిలో రైతులతో జరగనున్న సమావేశాలు కేవలం కంటి తుడుపు చర్యలేనని ఆయన పేర్కొన్నారు. చెరకుకు టన్నుకు రూ. 5,500 ధర నిర్ణయించాలని, అలాగే చక్కెర కర్మాగారాల్లో బరువు తూకంలో ,రికవరీ లెక్కల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కరువుతో ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రత్యేక సమావేశం ద్వారా రూ. 2,500 పరిహారం ఇస్తామని ప్రకటించి, ఆ తర్వాత ఆ మొత్తాన్ని విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అశోక ఆరోపించారు. ఇప్పుడు కూడా రైతుల డిమాండ్లను పరిష్కరించకుండా, కేవలం సమావేశాల పేరుతో వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. చెరకుకు గిట్టుబాటు ధర కల్పించాలని , రికవరీ లెక్కల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ స్పందించక పోవడం దారుణమన్నారు. ఇటువంటి నామమాత్రపు చర్చలతో రైతులు మోసపోరని అశోక స్పష్టం చేశారు.
