దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం దావోస్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఏపీలో తీసుకు వచ్చిన సంస్కరణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే వినూత్న ఆలోచనలతో ఉన్న వారిని ప్రొత్సహించేందుకు పీ-4 అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం అన్నారు సీఎం. పీ4 విధానం ద్వారా పేదరికాన్ని తగ్గించడంతో పాటు కొత్త ఆలోచనలు ఉన్న వారికి చేయూత ఇచ్చే విధంగా కూడా వ్యవస్థను తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలను ప్రొత్సహించడం ద్వారా స్థానికంగా పారిశ్రామికాభివృద్ధిని ప్రమోట్ చేస్తున్నాం అన్నారు.
గతేడాది మహిళా దినోత్సవం నాడు లక్ష మందిని మహిళా పారిశ్రామిక వేత్తలను చేస్తామని ప్రకటించామన్నారు చంద్రబాబు నాయుడు. ఇదే విధంగా విడతల వారీగా మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేలా ప్రొత్సహిస్తాం అన్నారు.ఏపీలో 10 లక్షల మందికి ఏఐ, క్వాంటం టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలని ఐబీఎంను కోరానని చెప్పారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులను కంపెనీలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు సీఎం. ఇలా చేయగలిగితేనే రాష్ట్రాభివృద్ధితోపాటు.. ప్రజలు కూడా అభివృద్ధి సాధించగలుగుతారని స్పష్టం చేశారు. ఎన్నో రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వాల్యూ ఎడిషన్ జరిగినప్పుడే అభివృద్ధి ఫలాలు అందుకోగలం అన్నారు.


















