న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. డీ లిమిటేషన్ , మహిళా బిల్లును వీగి పోయేలా చేసిన విపక్షాలను ఆయన ఏకిపారేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు లక్ష్మణ్. బిల్లును అడ్డు కోవడం ద్వారా మహిళల హక్కులను విపక్షాలు కాలరాశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మహిళలు కదం తొక్కుతున్నారని అన్నారు.
సౌత్ ప్రజలు కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలకు బుద్ధి చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. మహిళలను చట్ట సభలకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు డాక్టర్ లక్ష్మణ్. దేశ వ్యాప్తంగా మహిళలను ఏకం చేసి.. కాంగ్రెస్, విపక్షాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం అని ప్రకటించారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా స్పందించారు ఎంపీ. ఆయన చేసిన ప్రతిపాదనను ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించ లేదన్నారు. ఆయనను ఎవరూ పట్టించు కోవడం లేదన్నారు. ఇక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో తనకే తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు డాక్టర్ లక్ష్మణ్.

















