ధర్మేంద్ర ప్రధాన్ తొలగింపునకు ప్రతిపక్షం డిమాండ్

సోమవారం వరకు ఉభయ సభలు వాయిదా

hellotelugu-DharmendraPradhan

న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు ప్రతిపక్షాలు కట్టుబడి ఉండటంతో శుక్రవారం వరుసగా ఐదవ రోజు కూడా పార్లమెంటు కార్యకలాపాలు స్తంభించి పోయాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా తన విధులను నిర్వహించడంలో వైఫల్యం చెందారన్న ఆరోపణలపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. దీంతో రాజ్యసభ, లోక్‌సభ కార్యకలాపాలను సోమవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ పేపర్ లీక్, ‘జాతీయ గౌరవ అవమాన నివారణ (సవరణ) బిల్లు, 2026 ప్రవేశపెట్టడం వంటి అంశాలపై ప్రతిపక్షాలు నిరసన కొనసాగించారు. దీంతో మధ్యాహ్న భోజన విరామం తర్వాత సమావేశమైన వెంటనే రాజ్యసభ కార్యకలాపాలు ఆ రోజుకు వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సోమవారం నుండి ఎగువ సభలో ఎటువంటి ముఖ్యమైన కార్యకలాపాలు జరగలేదు.

రెండుసార్లు వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశం కాగా జాతీయ గౌరవ అవమాన నివారణ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ను కోరారు. అయితే, వామపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఈ బిల్లును ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ వాయిస్ ఓట్ ద్వారా ఆ ప్రతిపాదిత బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు అనుమ‌తించారు. బిల్లుపై చర్చను ప్రారంభించాలని చైర్మన్ కోరగా, ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించడంతో సభ వాయిదా పడింది. ఎగువ సభ తదుపరి సోమవారం సమావేశం కానుంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం , నిరసనకారులపై పోలీసుల చర్యపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేయడంలో ఉదయం పూట జరిగిన సమావేశాల్లో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది.

Exit mobile version