ప్రజా సమస్యలపై చ‌ట్ట స‌భ‌ల్లో గ‌ళం విప్పాలి

పార్టీ ప్రజా ప్రతినిధులకు వైయస్‌ జగన్‌ నిర్దేశం

hellotelugu-YSJagan

తాడేపల్లి గూడెం : శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలలో పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పాల‌ని స్ప‌ష్టం చేశారు వైసీపీ బాస్, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశా నిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై గతంలోనూ బాగా ప్రస్తావించామని, ఈసారి ఇంకా గట్టిగా పోరాడాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, వారికి సంబంధించిన ప్రతి అంశాన్నీ సభలో బలంగా ప్రస్తావించాలన్నారు. ముఖ్యంగా మండలిలో పార్టీకి బలం ఉన్నందున ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేలా పోరాడాలన్నారు జ‌గ‌న్ రెడ్డి. గతంలో కూడా పార్టీ ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేశార‌ని, ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌శ్నించాల‌న్నారు.

చ‌ట్ట స‌భ‌ల్లో వైయస్సార్‌సీపీ గొంతు వినిపించకూడదనే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఏపీ కూట‌మి స‌ర్కార్ క‌క్ష సాధింపుల‌కు దిగింద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడేందుకు నిర్ణీత సమయం, హక్కులు వస్తాయన్నారు. అందుకే ప్రభుత్వం ఆ హోదాను ఇవ్వడానికి ఇష్టపడటం లేద‌ని మండిప‌డ్డారు. దీంతో అసెంబ్లీలో పార్టీకి లభించే అవకాశం పరిమితంగా ఉంటుందన్నారు. అందుకే సాక్ష్యాలతో సహా, బయట ప్రెస్‌మీట్ల ద్వారా సమాధానం చెబుతాం అన్నారు. ఆ విధంగా ప్రజలకు ఒకవైపు మాత్రమే కాకుండా, ప్రతి అంశంలోనూ ‘నాణేనికి రెండోవైపు’ చూపించే ప్రయత్నం చేస్తాం అన్నారు మాజీ సీఎం.

డీఎస్సీ–2025లో పేపర్‌ లీకేజీ, అంతులేని అక్రమాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తాం అని ప్ర‌క‌టించారు. ఈ అంశాన్ని శాసనమండలిలో ప్రధానంగా లేవనెత్తాలని స్ప‌ష్టం చేశారు. డీఎస్సీ వ్యవహారంపై ఇప్పటికే 74 రోజులుగా దాదాపు 10 రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం అన్నారు. డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా వాటిపై సీబీఐ దర్యాప్తు కొనసాగాల్సిందేన‌ని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను ఇప్పటికే ప్రజల ముందుంచాం అన్నారు జ‌గ‌న్ రెడ్డి. డీఎస్సీ లీకేజీలు, అక్రమాలపై 74 రోజులుగా దాదాపు 10 రకాల కార్యక్రమాలు చేశాం.

Exit mobile version