హైదరాబాద్ : ఎస్‌టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు)ల నిర్వహణ లోపాలు సరిదిద్దుకోడానికి నెల గడువిస్తున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారం వాటి నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని సూచించారు. హైడ్రా నేతృత్వంలో జలమండలి, మున్సిపల్ కొర్పోరేషన్, పీసీబీ సంయుక్త తనిఖీలు నిర్వహిస్తామని ప్రకటించారు. నిబంధనలు పాటించని పక్షంలో చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ఎస్‌టీపీ నిర్వాహకులు, గేటెడ్ కమ్యూనిటీ నివాసితుల సంక్షేమ సంఘాలతో పాటు.. మున్సిపల్, జలమండలి, పీసీబీ అధికారులతో హైడ్రా కమిషనర్ హైడ్రా కార్యాలయంలో సమావేశమయ్యారు. విధి విధానాలపై చర్చించించారు. ఎస్‌టీపీల నిర్వహణలో లోపాలేంటి.. పాటించాల్సిన పద్ధతులు, శుద్ధి చేసిన నీళ్లలో ఉండాల్సిన ప్రమాణాల విషయమై సమీక్షించారు. ఆక్రమణలకు గురై మురికి కూపాలుగా ఉన్న చెరువును హైడ్రా పునరుద్ధరిస్తోంది. చెరువులకు మురుగు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసిన జలాలు చెరువులకు చేరేలా ఏర్పాట్లు చేస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక నీటి ఎద్దడి ఏర్పడింది. ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసిన జలాలను తాగునీటేతర అవసరాలకు పెద్దమొత్తంలో వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌టీపీల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఎస్‌టీపీల నిర్వహణపై హైడ్రా దృష్టి పెట్టిందని కమిషనర్ పేర్కొన్నారు.
గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, ఇతర ప్రాంగణాల్లోని ప్రైవేట్ మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిరంతరం పని చేయాలని ఏవీ రంగనాథ్ గారు సూచించారు. ఈ వివరాలను హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. శుద్ధి చేసిన నీటిని తాగునీటికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించాలని సూచించారు. మిగులు శుద్ధి జలాలను జలమండలి ద్వారా లేదా పరస్పర అంగీకారంతో సమీపంలోని వినియోగదారులకు సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌టీపీల నిర్వహణకు ప్రత్యేకంగా కరెంటు మీటరుండాలి. ప్రతి ఎస్‌టీపీలోకి వచ్చే మురుగునీరు, బయటకు వెళ్లే నీరు, విద్యుత్ వినియోగం, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగానికి సంబంధించిన వివరాలను రోజువారీగా నమోదు చేసి, ప్రతి నెలా జలమండలికి అప్‌లోడ్ చేయాలని సూచించారు. గేటెడ్ కమ్యూనిటీలు వారి అవసరాల మేరకే శుద్ధి చేసి.. మిగతాది మురుగు కాలువలకు వదిలేయరాదని తెలిపారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న నేపథ్యంలో మిగులు వాటర్ ఉంటే ఆ వివరాలు జలమండలికి పొందుపరిస్తే.. అవసరమైన వారికి సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
