అమరావతి : మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో బీమా అత్యంత కీలకమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హులైన ఏ ఒక్క మత్స్యకారుడూ బీమా రక్షణకు దూరం కాకూడదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా అమలవుతున్న బీమా పథకం పరిధిలోకి అర్హులందరినీ తీసుకు రావాలని మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. సముద్రంలో చేపల వేట సాగించేవారితో పాటు చేపలు, రొయ్యల చెరువుల్లో పనిచేసే కార్మికులు, ఫీడ్ రంగం సహా మత్స్య అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడిన వారికి కూడా ఆయా పథకాల అర్హత నిబంధనల మేరకు బీమా ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. ఇందుకోసం అర్హుల వివరాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన మత్స్యకారులు బీమా ప్రయోజనాలను కోల్పోయే పరిస్థితి తలెత్తకూడదని మంత్రి హెచ్చరించారు.
అటువంటి ఘటనలు జరిగితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం నష్టపోయిన మొత్తాన్ని సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేసే పరిస్థితి కూడా రావచ్చని స్పష్టం చేశారు. అధికారుల చిన్నపాటి అలసత్వం కూడా ఒక మత్స్యకార కుటుంబానికి జీవితాంతం తీరని నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అనుకోకుండా జరిగే కొన్ని ప్రమాదాలను నివారించడం సాధ్యం కాకపోవచ్చని, అయితే మానవ తప్పిదాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రాణనష్టాన్ని ఎంతమాత్రం సహించబోమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించక పోవడం, అవసరమైన రక్షణ పరికరాలు అందించక పోవడం, సాంకేతిక లోపాలను సకాలంలో పరిష్కరించ కపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో తక్షణమే ప్రత్యేక సమీక్ష నిర్వహించి, భద్రతా ప్రమాణాల అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కమిషనర్‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి అధికారి అప్రమత్తంగా వ్యవహరించేలా చూడాలని ఆదేశించారు. మత్స్యకారుల ప్రతి ప్రాణం ప్రభుత్వానికి అత్యంత విలువైనదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వారి భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మత్స్యకారులు ప్రభుత్వ హెచ్చరికలను గౌరవిస్తూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలని, అధికారులు తమ విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మత్స్యకారుల ప్రాణరక్షణతో పాటు వారి కుటుంబాల సంక్షేమం, ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
