అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. డీఎస్సీ-2026 నోటిఫికేషన్ ద్వారా 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 30 చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రత్యేక విద్యా విభాగాలు, వివిధ సొసైటీల పరిధిలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనరల్ పాఠశాలలు (SA, SGT): 2,111 పోస్టులు ఉండగా , స్పెషల్ ఎడ్యుకేషన్ (SA, SGT) 350 పోస్టులు ఉన్నాయి. వివిధ సొసైటీలు, ఇతర యాజమాన్యాలు (ప్రిన్సిపాల్, PGT, TGT, PD, PET)కింద 260 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 2,271 పోస్టులను నింపనుంది ఏపీ సర్కార్.
ఇదిలా ఉండగా టీచర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు డిసెంబర్ 20వ తేదీ నుంచి జనవరి 13, 2027 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) నిర్వహించనున్నారు. డిసెంబర్ 14 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. పరీక్ష విధానంపై అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 5 నుంచి ఆన్లైన్ మాక్ టెస్టులు అందుబాటులోకి తీసుకు రానున్నారు. పరీక్షలు పూర్తయిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు వారం రోజుల సమయం ఇవ్వనున్నారు. వాటిని నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం తుది కీ విడుదల చేసి, దాని ఆధారంగా ఫలితాలు ప్రకటించనున్నారు. దరఖాస్తుకు గడువు తక్కువగా ఉన్నందున అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
