బెంగళూరు : తమిళనాడు సీఎం, ప్రముఖ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం జన నాయగన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఉన్నట్టుండి బిగ్ షాక్ తగిలింది సినిమా యూనిట్ కు. విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రాన్ని ప్రదర్శించడానికి బెంగళూరులోని ‘విక్టరీ సినిమా’ నిరాకరించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సదరు సంస్థ. చిత్ర నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో వాణిజ్య పరమైన షరతులపై ఒప్పందం కుదరక పోవడమే దీనికి కారణం అని తెలిపింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ కోరిన షరతులు, ఇతర పంపిణీదారులకు వర్తించే సాధారణ విధానాలకు భిన్నంగా ఉన్నాయని థియేటర్ యాజమాన్యం తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అధికారిక ప్రకటనలో ఆరోపించింది.
ఇన్ స్టా స్టోరీలో ఇలా రాసింది. తలపతి విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం విక్టరీ సినిమాలో ప్రదర్శించబడదు. ఈ చిత్రాన్ని మా థియేటర్‌లో చూడాలని మీలో చాలా మంది ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు, అలాగే ఈ చిత్రాన్ని మా తెరపైకి తీసుకు రావాలని మేము కూడా అంతే ఆసక్తిగా ఉన్నామని తెలిపింది. పరిశ్రమలోని థియేటర్లన్నీ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి పంపిణీదారుకూ వర్తింపజేసే సాధారణ షరతుల ప్రకారమే జన నాయగన్ ను ప్రదర్శించడానికి విక్టరీ సినిమా సిద్ధంగా ఉందని పేర్కొంది యాజమాన్యం . తాము ఎంత ప్రయత్నించినప్పటికీ, ఒక ఒప్పందానికి రాలేక పోయామని అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.



















