న్యూఢిల్లీ : వాహనదారులకు ఖుష్ కబర్ చెప్పింది కేంద్ర సర్కార్. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేశారు కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఇక నుంచి వాహనాలు ఎక్కడా ఆగాల్సిన పని లేకుండా కొత్త విధానం టోల్ ప్లాజాలకు సంబంధించి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో అందుబాటులోకి కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ వస్తుందన్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద దేశంలోని పది ఎంపిక చేసిన ప్రాంతాలలో దీనిని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. టోల్ ప్లాజాల వద్ద ఫీజు వసూలు చేసేందుకు NETC విధానం తీసుకొచ్చింది NPCI. కాగా ఇది కూడా ఫాస్టాగ్ ద్వారానే పని చేస్తుందని తెలిపారు. టోల్‌ప్లాజా మీదుగా వెళ్లినప్పుడు వాహనం ఆపాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతాయని స్పష్టం చేశారు నితిన్ గడ్కరీ.
దేశ వ్యాప్తంగా వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి. ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రాంతం కలిగిన దేశంగా ఇండియా ఉందన్నారు. జాతీయ రహదారులు మొత్తం 1,46,195 కి.మీ పొడవును విస్తరించి ఉన్నాయని తెలిపారు .ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 7,000 కి.మీ రహదారులు నిర్మించడం జరిగిందన్నారు. దేశంలోని హైవే మౌలిక సదుపాయాలు ఇప్పుడు అమెరికాతో సమానంగా ఉన్నాయని గడ్కరీ నొక్కి చెప్పారు. ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్రాల మధ్య మెరుగైన కనెక్టివిటీతో భారతదేశం తన రవాణా మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నందున ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
