హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డులు కలిగిన వారికి తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారని ప్రకటించింది. రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం సంగారెడ్డిలో జరుగుతుందని తెలిపింది, ఇక్కడ ముఖ్యమంత్రి కొత్త రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభిస్తారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగా మంజూరైన , లామినేట్ చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ కార్డులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్త ప్రారంభోత్సవ కార్యక్రమ షెడ్యూల్‌కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్.
సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ పంపిణీని ప్రారంభిస్తారు. అదే సమయంలో, తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖల పూర్తి సహకారంతో, సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉదయం పూట జరుగుతాయి . సాయంత్రం 5:30 గంటలకు రాజ్ భవన్‌లో జరిగే ‘అట్ హోమ్’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి నియోజకవర్గ స్థాయి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాలన్నీ ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య నిర్వహించ బడతాయని తెలిపింది సర్కార్.
