కర్నూలు జిల్లా : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు.సైకోకు టీచర్లంటే కోపం అంటూ ఎద్దేవా చేశారు. అందుకే పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను టెన్త్ తప్పిన బ్యాచ్ కాదు, స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ ని. మైడియర్ జగన్ మూడోసారి చాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే టైమ్, డేట్ ఫిక్స్ చెయ్, మెగా డిఎస్సీపై చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని నారా లోకేష్ సవాల్ విసిరారు. ఆదోని నియోజకవర్గ టిడిపి కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ మాట్లాడారు. దొంగ సొమ్ముతో టీవి, పేపర్లు పెట్టింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు. గ్రూప్ -1 పేపర్లు లీకేజీ, మద్యం కుంభకోణంపై కూడా చర్చిద్దాం రా అని పేర్కొన్నారు. మొన్న నేను జగన్ కు చాలెంజ్ చేస్తే చెంచాలు బయటకు వచ్చారని మండిపడ్డారు. సిబిఐ ఎంక్వయిరీ కావాలని అంటున్నారు. అంత ప్రేమ ఉంటే బాబాయి హత్యలో ఎందుకు స్టే తెచ్చుకున్నారంటూ ప్రశ్నించారు.
అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కాకుండా ఎందుకు వాయిదాలపై వాయిదాలు కోరుతున్నారని వైఎస్ జగన్ ను లోకేష్ నిలదీశారు. డిఎస్సీ అంటే టిడిపి, టిడిపి అంటే డిఎస్సీ. 2ల క్షలమంది ఉపాధ్యాయులను నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. 150 రోజుల్లో 250 కేసులు వేసినా 16 వేల టీచర్ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశాం అన్నారు నారా లోకేష్. మెగా డిఎస్సీ ద్వారా ఎంపికైన 16 వేల మందిని తీసేయాలని పిల్ వేశారు. అందులో అధికంగా నష్ట పోయేది కర్నూలు జిల్లా యువతేనని, ఇదంతా ప్రజలకు తెలియ జేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా జగన్ భోగాపురం వైపు తొంగి చూడలేదన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు పనులను నాడు గాలికొదిలేసిన జగన్ ఇప్పుడు నేనే తెచ్చానని అంటున్నాడని , ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
