హైదరాబాద్ : పులుల సంరక్షణ విషయంలో బాధ్యతా యుతంగా వ్యవహరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సమాజంలోని అన్ని వర్గాలకు పిలుపునిచ్చారు.ఈ భూమి కేవలం మనుషులకే కాకుండా సమస్త జీవరాశికి ఉమ్మడి నివాసమని గుర్తించి, ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని ఆమె కోరారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దూలపల్లిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆమె తిలకించారు. అలాగే పులుల సంరక్షణకు సంబంధించిన ఒక లఘు చిత్రాన్ని కూడా ఆమె వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి సంవత్సరం జూలై 29న ‘ప్రపంచ పులుల దినోత్సవం’ జరుపుకుంటామని గుర్తు చేశారు. పులుల సంరక్షణ ప్రాధాన్యతపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం, నేడు ప్రకృతి పరిరక్షణకు ఒక గొప్ప వేదికగా మారిందని ఆమె పేర్కొన్నారు. పులి అటవీ సంపదకు చిహ్నమని, పులిని రక్షించడం అంటే అడవిని, పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని, భావి తరాల భవిష్యత్తును రక్షించడమేనని అన్నారు.
వేట, అటవీ నిర్మూలన, అక్రమ రవాణా వంటి కారణాల వల్ల పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం పట్ల మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని , 1973లో ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించి, దేశవ్యాప్తంగా పులుల సంరక్షణకు కఠిన చర్యలు చేపట్టిందని ఆమె వివరించారు. ఆ చర్యల ఫలితంగానే నేడు పులుల సంరక్షణలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని పులులలో దాదాపు 75 శాతం భారతదేశంలోనే ఉన్నాయని, దేశంలో 58 పులుల సంరక్షణ కేంద్రాలు విజయవంతంగా పని చేస్తున్నాయని చెప్పారు.
ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం కూడా విశిష్ట స్థానాన్ని కలిగి ఉందని మంత్రి తెలిపారు. దేశంలోని ప్రముఖ పులుల సంరక్షణ కేంద్రాలుగా అమ్రాబాద్, కవాల్ పులుల సంరక్షణ కేంద్రాలు గుర్తింపు పొందాయని ఆమె వెల్లడించారు. నీటి వనరుల అభివృద్ధి, ఆవాసాల మెరుగుదల, ఆధునిక రక్షణ చర్యల కారణంగా అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. కవాల్ పులుల సంరక్షణ కేంద్రంలో పులుల సంఖ్యను పెంచేందుకు ‘పులుల పునః ప్రవేశం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రితెలిపారు. ఇందులో భాగంగా, పులుల సహజ సంచారానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించేందుకు కవాల్ పులుల సంరక్షణ కేంద్రానికి మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేంద్రంతో అనుసంధానం కల్పించినట్లు వివరించారు. అదనంగా, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
