విజయవాడ : ఏపీ కూటమి సర్కార్ ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించిందన్నారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఎంఎస్ఎంఈలు కీలకంగా మారనున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టుకున్న 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని సాధించడంలో సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమలు అత్యంత ముఖ్యంగా మారనున్నాయని పేర్కొన్నారు. రాబోయే మూడు నెలల్లో కనీసం 100 ఆంధ్రప్రదేశ్ ఆధారిత కంపెనీలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయ్యేలా చూడాలని ఆయన ఎంఎస్ఎంఈ శాఖను ఆదేశించారు. ఎన్ఎస్ఈ నిర్వహించిన ఎస్ఎంఈ ఐపీఓ వృద్ధికి ప్రత్యామ్నాయ నిధుల ఎంపిక అనే అవగాహన సదస్సును ఉద్దేశించి లోకేష్ ప్రసంగించారు.
ఆంధ్రలో తయారీ – భారతదేశం కోసం తయారీ – ప్రపంచం కోసం తయారీ అనే దార్శనికతతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఈ సీఓం, మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ చౌహాన్ , ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు , కేసినేని శివనాథ్, ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ సీఈవో ఎం. విశ్వ, సెబి, ఎన్ఎస్ఈ , ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే ఆలోచన తన యువగళం పాదయాత్ర సమయంలో కలిగిన అనుభవాల నుండి ప్రేరణ పొందిందని లోకేష్ తెలిపారు. కియా మోటార్స్ సమీపంలోని పెనుగొండ వద్ద జరిగిన ఒక సంభాషణను గుర్తు చేసుకుంటూ, ఆ ప్రాంతానికి పారిశ్రామిక పెట్టుబడులు వచ్చిన తర్వాత కియా అనుబంధ సంస్థలో ఉద్యోగం పొందిన పద్మావతి అనే మహిళ గురించి ఆయన ప్రస్తావించారు.

















